April 25, 2024

చలం కలం నుంచి…

అంగుళం మందంలో పేరుకుపోయిన కట్టుబాట్లను వెక్కిరిస్తున్న చలం రచనలు సమాజాన్ని వెక్కింతగా మారిన నాటి నుంచీ ఆయన రచనలు చదవాలనే కాంక్ష పాఠకుడిలో పెరిగింది. పెద్దలు హద్దులు పెట్టినా చాటుగా చలం రచనలు చదివే పాఠకులు ఎక్కువయ్యారు.

స్త్రీని వస్తువుగా కాక మనసున్న మనిషిగా చూసిన కాలం.. చలం నాటి కాలమనే చెప్పాలి. చలం సాహిత్య ప్రభావం బలమైనది. ఇక తెలుగు సాహిత్యంలో చలం అంతటి వివాదాస్పద రచయిత మరొకరు లేరనేది సత్యం. ఆనాటి కాలంలో ఆయన రచనలన్నీ సంచలనాలే. పవిత్ర భారతావనిలో కట్టుబాట్ల పుట్టలో చేయిపెట్టి విషనాగులా పెరిగిపోయిన మూఢాచారాలను పైకి తీసి వేలెత్తి చూపించిన గొప్ప సంఘసంస్కర్త చలం. విమర్శలను ఎదుర్కున్నఈ సమాజం చలాన్ని వెలివేసింది. ఓరకంగా చలమే ఈ కుళ్ళు సమాజాన్ని వెలివేసాడని చెప్పాలి. భార్యాభర్తల బంధంలో స్త్రీ కి జరిగే అవమానాలను, అనాధరణనను వేలెత్తి చూపాడు. ఆమెకూ ఓ హృదయం ఉంటుందని నిరూపించాడు. ఆమె వంటింటికే పరిమితం కాదన్నాడు. ఆ మనసులో వేయి వసంతాలు పూయించుకునే కలలున్నాయన్నాడు. పురుషాధిక్యానికి అలవాటు పడిన సమాజానికి ఈ మాటలు రుచించలేదు. ఇందులోంచే చలం రచనలు పుట్టుకువచ్చాయి. అంగుళం మందంలో పేరుకుపోయిన కట్టుబాట్లను వెక్కిరిస్తున్న చలం రచనలు సమాజాన్ని వెక్కింతగా మారిన నాటి నుంచీ ఆయన రచనలు చదవాలనే కాంక్ష పాఠకుడిలో పెరిగింది. పెద్దలు హద్దులు పెట్టినా చాటుగా చలం రచనలు చదివే పాఠకులు ఎక్కువయ్యారు.
ఇందులో పురుషాధిక్య సమాజపు నీతి నియమాలను వ్యతిరేకించిన చలం రచనలు చలం రచనల్లోని స్త్రీ పాత్రలు సమాజంలోని స్త్రీలను ఆలోచింపజేసాయి. శశిరేఖ, అరుణ వంటి వ్యక్తిత్వం ఉన్న స్త్రీలను దగ్గర చేసుకునేలా చేసాయి.వారిలో గూడుకట్టుకుని ఉన్న భావాలను పైకి తెలియనీయని స్త్రీలు ఆలోచించసాగారు.
చలం రచనల్లో చాలా వరకూ మోహం, కాంక్ష, స్త్రీ, ఆకర్షణ, ప్రేమ ఇలా చాలా కోణాలను చూడగలిగాం. అయితే వీటన్నింటికీ భిన్నం ఆయనకు ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చిన రచన మైదానం. స్త్రీ స్వేచ్ఛ ఆమెకు సమాజ పరంగా ఉన్న ఆదరణ, గౌరవ స్థానంలో ఉన్న స్త్రీకీ, కట్టుబాట్లను కాదని బయటకు వచ్చిన స్త్రీకి ఉన్న భేధాన్ని, వ్యత్యాసాన్ని చూపించింది. స్త్రీ పురుషుల మధ్య ఉన్న సంబంధ భాంధవ్యాల మీద ఓ ఆలోచనను లేవనెత్తిన పుస్తకం మైదానం.
మైదానం పుస్తకం మొత్తం రాజేశ్వరి చుట్టూ ఆమెకు ఉన్న స్వేచ్ఛ ఆమె జీవితంలో వచ్చిన మార్పుల మీద మాత్రమే నడుస్తుంది. మైదానం గుడిపాటి వెంకట చలం 1927లో రచించిన నవల. భర్తతో ఏర్పడిన వైవాహిక జీవితంలోని ఇబ్బందులు, సమాజం ఆమెను చూసిన విధానం మనకు స్త్రీ వెనుక నిలబడి చలం వివరిస్తాడు. ఈ నవలంతా కూడా స్త్రీ కోణం నుంచే ఉంటుంది. ఈ నవల మొత్తం ఒక్క రాజేశ్వరి వ్యక్తి గత జీవితం చుట్టూ తిరుగుతూ స్త్రీ శారీరక సుఖం కోసం పడే తపనలోంచి ఆమె భర్తను కాకుండా మరో వ్యక్తిని తన జీవితంలోకి స్వగతించి.., సమాజంలో గౌరవ స్థానంలో ఉంటూ బ్రాహ్మణ కుటుంబంలో వకీలు భర్తకు భార్యగా ఆచారవ్యవహారాలను తూచా తప్పక పాటించే ఆ స్త్రీ అమీర్ అనే ముస్లీం యువకుడితో వెళిపోయి, ఊరికి దూరంగా జీవిచడం మొదలు పెడుతుంది.
తాను అనుభవించిన గత జీవితం సిరిసంపదలు చూసేవారికి అబ్బరమేమో కానీ, రాజేశ్వరి వాటికి మురిసిపోలేదు.. భర్తతో ఆమెకు ఉన్న దూరం ఆ ఇద్దరినీ వేరుచేసేలా చేసింది. మూడో వ్యక్తిని తన జీవితంలో కి తెచ్చేట్టు చేసింది. ఇక ఈ మడీ ఆచారాలు ఆమెను పునీతగా నిలపలేదు.. తన చుట్టూ ఉన్న జీవితం రాజేశ్వరి జైలుగానే భావించింది. ప్రస్తుతంలో గత జీవితంలో ఉన్న ఆడంబరాలు ఇక్కడలేకున్నా అమీర్ తో సుఖాన్ని సౌఖాన్ని పొందడంలో ఆమె ధనవంతురాలిగా గర్వపడింది. స్వేచ్చగా పావురాయిలా విహరించాలని కలల కన్న ఆమెకు తనకు నచ్చి న విధంగా స్వేచ్ఛగా జీవించే వీలు కలిగింది.
మడి, ఆచారాలను వదిలి దొరికింది తిని, గిల్లికజ్జాలతో, ఆటలతో ప్రేమ ఊసుల ఉసుర్లతో కాలాన్ని గడిపింది. చెరువుగట్టున దొరికే చేపలనే తిని చింకి చీరనే కట్టింది. కుండ నీటినే మధుర పానీయంగా తీసుకుంది. తాను జీవిస్తున్న జీవితంలోనే సంతృప్తిని ఆనందాన్నీ వెతుక్కుంది. ఇదంతా చూసేవాళ్లకు దర్భర జీవితంగా అనిపించినా ఆమెకు స్వర్గమే అయింది.
కథ మొత్తం చాలా ఆశక్తి కరంగా మారి ప్రేమించిన ప్రియుడి ప్రేమలో మార్పుని గమనించి అతనికి నచ్చిన స్త్రీని రాజేశ్వరే దగ్గర చేయడం తో కథలో రాజేశ్వరిలోని ప్రేమను ఆమె త్యాగాన్ని చూస్తాం. ఆమెలోని ఇన్ని కోణాలను చూస్తున్న జనం విచ్చల విడిగా బ్రతుకుతుందన్న ఆపవాదును మోపుతుంది.
అయితే ఇక్కడ స్త్రీ తాను మనసిచ్చి అన్నీ అతనే అనుకున్నాకా అతనికోసం దేనికైనా వెనకాడక పోవటం మనం చూస్తాం. ఓ వైపు రాజేశ్వరిలో జనం విచ్చలవిడి తనం చూసినా, మరో వైపు ఎల్లలు లేని ఆమె ప్రేమను త్యాగాన్నీ చూస్తారు. పురుషుడు కేవలం స్త్రీ శరీరాన్ని కోరుకుంటే, స్త్రీ మాత్రం శరీర వాంఛకి మాత్రుత్వమే పరాకాష్ట గా భావించడం చూస్తాం. ఆ సంతానం సక్రమమా అంటే కట్టుబాట్లకు లోబడి సమాజం భర్త అని గుర్తించిన పురుషుడి ద్వారా కలిగిందా లేక ‘లేవదీసుకు’ పోయిన మగాడి ద్వారా కలిగిందా అనే విషయం కంటే మాతృత్వమే ఉన్నతమేమో స్త్రీకి అనిపించక మానదు.
మీరా పాత్రతో కథ మరింత నచ్చుతుంది మనకు., రాజేశ్వరి కంటే వయస్సులో చిన్న వాడు. మీరా సేవకి, తద్వారా ఉత్పన్నమైన ప్రేమకి రాజేశ్వరి లొంగి పోవటమూ చూస్తాం. అమీర్ వచ్చి వాళ్ళిద్దరి అనుబంధం చూసి అసూయ పడటం, ప్రాణ త్యాగం, రాజేశ్వరి నేరాన్ని తనపై వేసుకోవడం చూస్తాం!
ఈ చిన్న నవలలో అన్ని ఎలిమెంట్స్ మనం గమనించిన పాఠకుడికి ఇదో గొప్పరచనగా నిలవడానికి కారణం .. ఇందులోని ప్రేమ, స్వేచ్ఛ, ఆవేశం, కామం, అసూయ, ద్వేషం, తిరుగు బాటు, త్రికోణ ప్రేమ కారణాలుగా నిలుస్తాయి. చలం కేంద్ర బిందువు మాత్రం స్త్రీ! ప్రియుడికీ దూరమై ఓ ఒంటరిగా మిగిలిపోయిన ఆమెను సమాజం కోణం నుంచీ చూపించాలనుకున్నాడు చలం. ఇదంతా మైదానంలో కథగా మిగిలినా నిజ జీవితపు సారాన్ని కూడా వడబోసి చలం చూపించాడు అనిపిస్తుంది. వందేళ్ళు దాటిన కథ అయినా చలం చెప్పినది జీవిత సత్యమని అందులో ఎలాంటి మార్పూ రాలేదని మనకు ఇట్టే తెలిసే అంశం. అయితే కాలం మారుతున్నా ఈ మైదానంలోలా ఎందరో ఆడవాళ్ళ జీవిత సారం దాదాపు ఇలానే ఉంది..ఆడదాని ఎదుగుదలకు అడుగడుగునా ఇంకా అవరోధాలు తగులుతూనే ఉన్నాయి. ఎందరో రాజేశ్వరులు తమకు నచ్చని జీవితాలను బ్రతుకుతూనే ఉన్నారు.

Discover more from SAGARVA BHARATH FOUNDATION

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading