కథలు ఏలా మొదలు అవుతాయి? అనగనగా అంటూ మొదలై కంచికి పోయేంతదాకా శ్రోతని..లేదా పాఠకుడిని ఎటూ కదలలేని ప్రపంచంలోకి ఇరికించేసి..మరో కొత్త లోకాన్ని..కొత్త వ్యక్తులను పరిచయం చేస్తాయి కథలు. కథను చెప్పే తీరులో అంతటి చిత్రం ఉందో లేదా కథను అల్లే విధానంలో అంత మాధుర్యం ఇమిడి ఉందో తెలీదు. కాలానికి తగ్గట్టు కథ మారుతూ వచ్చినా కథకు ఉన్న ఆధరణ ఎన్నడూ తగ్గలేదు. కథ కథలానే ఉంది మనమే మారాం. కొంత కాలం వెనక్కు వెళితే కథలు చెప్పే బామ్మల ముందు సాయంకాలాలు కూచుని గోరు ముద్దలు తింటూ వాళ్ళు చెప్పే కాశీమజిలీ కథలకు ఊ కొట్టేవాళ్లం. మరికాస్త ముందుకు వస్తే నాన్నలు తమ గుండెల మీద కూచోబెట్టుకుని వాళ్ళకు తెలిసిన కథలను చెప్పేవారు. మరిప్పుడు ప్రస్తుతంలో కథలను కంప్య్వూటర్ లలో టీవీలలోనూ చూసి తెలుసుకుంటున్నారు. కథ రూపుమార్చుకున్నా ఆదరణను..ఆశక్తినీ మార్చుకోలేదు. ఇంతకీ చెప్పేదేమంటే కాశీమజిలీలంత పసందుగా.. పేదరాశి పెద్దమ్మ చెప్పే రాజుల కథలంత ఆశక్తిగా.. మన ఊళ్ళో జరిగే తిరణాళ్ళంత ఉత్సాహంగా ఉండే కథల గురించి మాట్లాడుకుందాం.
అదో చిన్న ఊరు ఆ ఊరిలో ప్రతి వ్యక్తికీ ఓ కథ ఉండే ఉంటుంది. ఆ కథలన్నీ ఓ పెద్దమనిషి మన ముందు ఉంచుతాడు. ఆయనే.. రచయిత సత్యం శంకరమంచి. ఇంతకీ ఆయన చెప్పిన కథలు అమరావతి కథలు.. సత్యం శంకరమంచి పుట్టి పెరిగింది అమరావతి గ్రామంలో. ఆయన చిన్నతనంలో ఉన్న సామాజిక పరిస్థితులు, జీవన విధానాలతో పాటు, ఆ ప్రాంత చరిత్రలో పరిశోధన చేసి వ్రాసిన కథలు అమరావతి కథలు. అన్ని కథలు అమరావతిలో జరిగినవే. ఊహాజనిత గ్రామమో లేక పట్టణమో తన కథలకు వేదికగా రచయిత సత్యం తీసుకోలేదు. తనకు తెలిసిన అమరావతి గ్రామం తరువాత పట్టణమయినా, తన కథలన్ని అక్కడజరిగిన సంఘటనలుగానే తీర్చి దిద్దారు. ఒక పేజీ కంటే ఎక్కువ మించని కథలే అన్నీ.. కథలన్నీ చక్కని తేట తెలుగులో సులువైన శైలితో మన చుట్టూ ఇప్పుడు లేని వాతావరణాన్ని ఒకప్పుడు ఉందని చూపిస్తూ చెప్పిన కథలు ఈ అమరావతి కథలు. కథల్లోని పాత్రలన్నీ గ్రామీణ వాతావరణాన్ని తమతో మోసుకొస్తాయి. పంతులుగారు, వరదా, పూజారిగారి భార్య, సుబ్బిశెట్టి, గారెలమ్మె తిప్పడు, మాల సంగడు ఇలా చాలా పాత్రలు మనల్ని కాసేపు వాళ్లతో మాట్లాడేటట్టు చేసి కాలక్షేపాన్నిస్తాయి.
అంతేకాదు ఈ అమరావతి కథలకు చాలా చరిత్రే ఉంది. ఈ కథా సంపుటి 1979లో ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతిని పొందింది. ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ ఈ కథలను హిందీలో ధారావాహికగా చిత్రించారు. ఈ ధారావాహిక దూరదర్శన్ లో ప్రసారం కూడా అయింది. అప్పుడే ఈ కథా సంపుటి మరికొందరికి తెలిసింది కూడా. ఇవన్నీ ఓ ఎత్తయితే 100 వారాల పాటు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ఈ కథలు ప్రచురితం అయ్యాయి. ఎంతగానో ప్రజాదరణ పొందాయి. ఇందులోని పాత్రలన్నీ చాలా వరకూ శంకమంచిగారికి తెలిసిన వ్యక్తులే. నిజ జీవితపు తాలుకు ఆనవాళ్ళు ఉన్న కథలే అవన్నీ. కల్పనకు, వాస్తవానికీ ఈ కథలు చెప్పే తేడా కూడా మనకు ఇట్టే తెలిసిపోతుంది. అయితే శంకరమంచి మొదలు పెట్టిన ఈ గొలుసు కథల విధానం తరువాత చాలామంది రచయితలకు గొలుసు కట్టు కథల ఆలోచనను తెచ్చి రాసేట్టు చేసింది. కృష్ణానది గలలతోపాటు వాడిగా వేడిగా అమాయకత్వాన్ని అక్షయపాత్రలో పెట్టి వడ్డించిన కథలోని పాత్రలు అవన్నీ. చిత్రకారుడు బాపు గీసిన బొమ్మలు ఈకథలకు కొత్త మెరుగులద్దాయి. ప్రతి కథలోకి వెళ్ళి చదివేలోపు బాపు గీసిన బొమ్మ లోపలి కథనంతా గుట్టు విప్పి చెప్పేస్తుంది. ఆయన కుంచె గీతల్లోనే కథను తెలుసుకోవచ్చన్నమాట. చిలిపితనాన్ని, నిండుతనాన్ని అలకరించుకుని రచయిత ప్రాణం పోసిన ఈ పాత్రలన్నీ పుస్తకంగా మన ఇంటికి వచ్చినపుడు తెరిచి వాటితో కాసేపు గడిపితే చాలు ఇంకేముంది అమరావతిని చుట్టి వచ్చినట్టే.. కాసేపు ఆ వీధుల్లో తిరుగాడినట్టే.. ఆ కథల్లోని వ్యక్తుల్ని కలిసి వచ్చినట్టే అనుభూతిని చెందుతారు.
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
చంద్రగిరి శిఖరం
రేడియో హీరోయిన్ శారదా శ్రీనివాసన్….