September 29, 2023

నేనే నా ఆయుధం | చిర్ర సతీష్

నా పేరు చిర్ర సతీష్ మాది రామనుజపురం గ్రామం, పెద్ద ముప్పారం పోస్ట్, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.

మాది మధ్య తరగతి పేద కుటుంబం మా నాన్న గారు వ్యవసాయ కూలి మా అమ్మ గారు దర్జీ.నేను పుట్టుకతోనే అంగవైకల్యం వినికిడి సమస్యతో జన్మించాను. మా తల్లిదండ్రులది బాల్య వివాహాముతో పాటు మేనరిక వివాహం కూడా ఒక కారణం. నా బాల్యంలో బడికి వెళ్లాలి అంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఉపాధ్యాయులు జెప్పే పాఠాలు సరిగ్గా అర్థంకాక పోయేవి నా తోటి విద్యార్థులు చెవులు వినబడవ్ చెవిటోడు అని హేళన జేసేవారు. రోజు బడికి వెళ్లనని మారాం జేసేవాడిని నా తల్లిదండ్రులు బుజ్జగించి ధైర్యం జెప్పి బడికి పంపేవారు. ఆట పాటలతో పాటు చదువులో కూడా ముందుండే వాడిని. బడిలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే వాడిని. ఈ వినికిడి సమస్య నన్ను తీవ్రంగా బాధించేది. నాకు చిన్నప్పటి నుండి స్వామి వివేకానంద, ఎపిజె అబ్దుల్ కలామ్ గారు అంటే చాలా ఇష్టం. బాల్యంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 10వతరగతి పూర్తి జేశాను.

మా తల్లిదండ్రులు చినప్పటి నుండి సమాజ సేవకులు ఊరిలో ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు నిర్వహించే వారు. నేను కూడా ఉత్సాహంగా పాల్గొనే వాడిని. నేను స్వామి వివేకానంద, ఏపిజె అబ్దుల్ కలాం గారి పుస్తకాలు చదివి ఎంతో స్ఫూర్తిని పొందాను. అంగవైకల్యం అనేది అది మనిషికే కానీ మనసుకు కాదు అని తెలుసుకున్నాను.

మా తల్లిదండ్రులు నా బాల్యంలో నన్ను దేవాలయాలకు,సత్సంగ భజన కార్యక్రమాలకు తీసుకెళ్లేవారు. రామాయణం, మహాభారతం,భగవద్గీత గ్రంధాలు చదివి నాకు వినిపించే వారు. అలా చేయడం ద్వారా నాలో ఆత్మన్యూనత భావాన్ని జయించాను. ఎన్నో ఇబ్బందులు నడుమ ఇంటర్,మరియు డిగ్రీ పూర్తి జేశాను.నాకు చిన్నప్పటి నుండి సమాజ చేయాలనే కోరిక ఉండేది.

ప్రార్ధించే పెదవుల కంటే సహాయం జేసే చేతులే గొప్పవి అన్న మదర్ తెరిస్సా మాటలను స్ఫూర్తిగా తీసుకుని స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ స్థాపించి నా వంతు చిన్న చిన్న సేవ కార్యక్రమాలు వృద్ధులకు,అభాగ్యులకు, అల్పాహారం పంపిణీ, దుప్పట్లు పంపిణీ,పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ జేశాను. నేను జిల్లా కలెక్టర్ అయితే మరింత సమాజ సేవ జేయగలను అనే ఆశయంతో సివిల్స్ పరీక్షలకు కూడా ప్రిపేర్ అయ్యాను.అన్ని పరీక్షలు రాశాను కానీ అనుకున్న సివిల్స్ కి ఎంపిక కాలేకపోయాను.

సమాజంలో జరుగుతున్న సంఘటనలు బాల్య వివాహాలు, ఆత్మహత్యలు, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, దేశాన్ని గౌరవించక పోవడం,పాశ్యాత్య సంప్రదాయాలను అనుకరించడం వంటివి నన్ను తీవ్రంగా కలిచి వేశాయి.మార్పు అనేది నా నుండే మొదలు కావాలి అని కంకణం కట్టుకున్నాను.

ఆనాడు ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్ర్యమును సాధించి పెట్టారు ఆనాడు నాకు ఎందుకులే అని మహానుభావులు అనుకుంటే ఈరోజు మనం ఈ స్వాతంత్య్రమును అనుభవించే వాళ్లము కాదు, కాబట్టి నేను వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా శిక్షణ తీసుకొని ఇప్పటి వరకు 30 ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వ్యక్తిత్వ వికాస సదస్సులు నిర్వహించి దాదాపు 30,000 మంది విద్యార్థులలో స్ఫూర్తిని కలిగించాను.

అంతరించిపోతున్న అడవులను, సహజ వనరులు, పక్షులు,కాపాడుకోసం నేను సైతం అనే కార్యక్రమం పేరుతో ప్రజలలో అవగాహన కల్పించాను. నాలాగా అంగవైకల్యంతో బాధపడే వారి జీవితాల్లో మార్పు తీసుకరావాలి అని నేను అనుకుంటున్నాను. వారి జీవితాల్లో వెలుగులు నింపడం నా కర్తవ్యం. ప్రతి ఒక్కరు ఈ దేశం నాకేమి జేసింది అనే ఆలోచనతో కాకుండా దేశానికి నేను ఏమి జెయ్యగలను అనే విధంగా ఆలోచించి అందరూ ముందుకు వస్తే మన దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లగలదు. ప్రపంచంలో యువత ఎక్కువ ఉన్న దేశం మనదే ఇది మనకు సువర్ణ అవకాశం.యువతలో ఉన్న ప్రతిభ పాటవాలు అపారం వాటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి.

నేటి యువతలో దేశ భక్తి కంటే దేహ భక్తి పెరిగిపోయింది పనికి రాని సినీ నటులకు అనుకరించి విలువైన సమయాన్ని, జీవితాన్ని వృధా జేసుకుంటున్నారు.ఒకప్పడు హీరోషిమ, నాగసాకి అణు బాంబు దాడి జరిగినప్పుడు జపాన్ లో ముందు ముందు గడ్డి మొక్క కూడా మొలవదు అన్నారు కానీ ఈరోజు ప్రపంచంలో చిన్న దేశం అయిన జపాన్ ఈరోజు అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో టాప్ 10వ స్థానంలో ఉంది, కారణం అక్కడ యువత అనుకున్నది చేసి చూపించారు.

దేశం అంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు మాతృభూమి కన్న తల్లి వంటిది. పుట్టిన ప్రతి ఒక్కరు మన దేశం కోసం త్యాగ భావాన్ని,సేవ భావాన్ని కలిగి ఉండాలి అని నేను సూచిస్తున్నాను. మహాత్ముల వారి జీవితాలను చదివి వారిని ప్రేరణ తీసుకుని నేను సైతం దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని నేను ఆశిస్తున్నాను.

సహజ వనరులను పరిమితంగా వాడుకోవాలని రేపటి తరాలకు కూడా అందించాలని సహజ వనరులను దుర్వినియోగం జెయ్యకూడదు అని ప్రతి ఒక్కరు ఒక్క మొక్కని నాటాలి అని నేను కోరుకుంటున్నాను.ప్రతి ఒక్కరు ఆమె వ్యక్తిలా కాకుండా ఒక శక్తిలా మారాలి అని నేను సూచిస్తున్నాను.

నాకు ఈ అవకాశం కల్పించిన కనెక్టెడ్ ఇండియన్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.

జై హింద్
భారత్ మాతా కి జై

–చిర్ర సతీష్

%d bloggers like this: