December 11, 2023

ఆశయగీతాలు – అభిరుచి నేస్తాలు

  1. ఆరంభం

ఆరంభం.. ఆరంభం..

ఆరంభం ఆరంభం
యువతరం ప్రారంభం

గళం విప్పి
కదం తొక్కి
కదిలిందో ప్రస్థానం

భగభగ మండిన ఉషోదయం
భరతజాతికది నవోదయం
స్వేచ్ఛా హక్కుల ప్రభంజనం
స్వదేశి శక్తుల సమాగమం
విదేశి కుట్రలు పలాయనం

ఆరంభం ఆరంభం
అర్థరాత్రి ప్రారంభం
అధికారం ఆరంభం

ఆకలి మింగి
అసువులు బాసిన
మా భుజాల శవాలపై
ఆ శవాల భుజాలపై
నిలిచింది అధికారం

పార్టీకో లక్ష్యము
ప్రజలకేమో భిక్షము

ప్రభుత్వమంటే
అది పార్టీల సోంతమా
వారసత్వ రాజ్యమా
ఇది ప్రజాస్వామ్య దేశమా

నోటులు చల్లి
ఓటులు అడిగి
గద్దెయెక్కి
గొంతులు కోస్తే

కనబడలేదా
కాటు వేసిన
నాయకులు

వినబడలేదా
హక్కులు మింగిన
రాచరిక గొంతుకలు

అధికారం
అధికారం
మీమిచ్చిన అధికారం
సేవచేసె అధికారం

అంధకార
అధికారం
మీచేతి అధికారం
మాపైనా ధిక్కారం?

అధికారం
అధికారం
మాకుంది అధికారం
నిలదీసే స్వాధికారం

నెత్తురు మండిన
శక్తుల నుండి
పగిలిన గుండెల
వేదన నుండి

తిరుగుబాటుకు
బాటలు వేస్తాం
విప్లవాలతో
గర్జన చేస్తాం

గడప దాటి అమ్మలార
బలమైన శక్తులార
కదలండి

మత్తు వీడి యువకులార
ఉత్తేజవంతులార
రారండి

రారండోయ్ రారండి

దేశద్రోహి శక్తులను
స్వేచ్ఛగోరి బలియిద్దాం
కులాంతరాలు విడిచి
రాచరికం నిర్మూలిద్దాం..

ఆరంభం
ఆరంభం
అప్పుడే
అప్పుడే..
యువతరం ప్రారంభం
నవశకం ఆరంభం


2. కోతి కొమ్మచ్చి

కొమ్మ కొమ్మలపై
కోతి కొమ్మచ్చి

కోకిల గొంతెత్తి
కుర్రాళ్ళు హోరెత్తి
పచ్చని పల్లెల్లో
చెట్టు కొమ్మల్లో

ఊరొచ్చిన పిల్లలతో కోతి కొమ్మచ్చి
ఊయల ఊగాలో కోతి కొమ్మచ్చి

చల్లని కుండ
చెరువులు నిండ
చాకలి దరువు
చద్దియన్నము

పల్లె చల్లంగుండాలో కోతి కొమ్మచ్చి
ఆకలి చావులు ఆగాలో కోతి కొమ్మచ్చి

వాగు వంకల్లో
వాన జల్లుల్లో
ముసిరిన మబ్బుల్లో
మెరిసేటి మువ్వల్లో

పల్లె అందం చూడాలో కోతి కొమ్మచ్చి
చెక్కభజనలు చేయాలో కోతి కొమ్మచ్చి

గోచి పెట్టి గోవులు మేపి
జారుడు బండలో చేపలు పట్టి
వేరుశెనగలకు కారందట్టి
కమ్మని పెరుగు మామిడి పచ్చడి
అమ్మలు పెట్టే గోరుముద్దలు

జాబిలి దిగివచ్చి కోతి కొమ్మచ్చి
ప్రకృతి రుచులే చూడాలో కోతి కొమ్మచ్చి

తొక్కుడుబిళ్ళ
తోసే బండి
గాలి పటాలు
గాల్లో వదిలి

స్వేచ్ఛగా ఎదగాలో కోతి కొమ్మచ్చి
చేతిలో కళలుంటే చాలు కోతి కొమ్మచ్చి

ఉగాది పచ్చడి
సంక్రాంతి సందడి
వినాయక చవితి
ఊరేగింపు
పీర్ల పండుగ
పులి వేశాలు

పల్లె పండుగ చూడాలో కోతి కొమ్మచ్చి
సంస్కారం నేర్వాలో కోతి కొమ్మచ్చి

ఎండిన పొలానికి
నీరెట్టండి
ఎండ్ల బండులకు
నారెత్తండి

చెంగు చెంగున లేగదూడలై
నిద్దురవీడి పరిగెత్తండి

పల్లెలు..
రైతుల రాజ్యంరో కోతి కొమ్మచ్చి
మరి రైతులు..
ఆకలి తీర్చే సైనికులో కోతి కొమ్మచ్చి


3. ఓ భరతదేశమా!

ఓ భరతదేశమా!
నా సుస్వరాజ్యమా!!

సప్తపదుల వసంతమా!
ఆకలి చిగురు సొంతమా!!

సాగిపో పారిపో
ఓ నేస్తం
స్వార్థాలకు జైకొట్టి
స్వప్నాలకు సలాం కొట్టి

వాహనాల మేఘాలు
రక్తధార కురిపిస్తే
ప్రాణాలను విడిచిపెట్టి
నీ గొడుగు పట్టి పారిపో

అత్యాచార అమోదం
మూడుముళ్ళ బంధమైతే
తాళిబొట్టు బరువవదా
అబల బతుకు బలి కాదా

నాగలికే నాలుకుంటే
అవనికే ఆకలేస్తే
పట్టెడన్నం పండేనా
ప్రాణకోటి నిలిచేనా

లంచాల మంచంపై
వారసత్వ కడుపులోంచి
పదవులు పుట్టుకొస్తే
సిగ్గు విడిచి సాగిపో

అనాథగా తల్లినొదిలి
ఆకలినే ఎర వేసి
మతాల వల వేసి
చీకటి తుపాకి పడితే

ఎక్కడుంది నా దేశం
పరదేశీ మత్తులోనా
నడిరోడ్డు హత్యలోనా
ఓటుకొనే నోటులోనా

ఎక్కడుంది స్వరాజ్యం
మత్తులోని యువతలోనా
చెత్తకుప్పలోని పసిపాపలోనా
ముసలిదైన పొలంలోనా

ఎక్కడుంది అభ్యుదయం
చిరిగిన సంస్కృతిలోనా
ఊరి చివర గుడిసెలోనా
చెలరేగిన టెక్నాలజిలోనా

పదరా సోదరా
నడవరా నేస్తం
సువర్ణ సంకెళ్ళు తెంచు
నీ కలల కత్తి పట్టి

జైహింద్!

%d