తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా…
దలచితినే హేరంభుని దలచిన నా విఘ్నములును తొలగుట కొరకున్’
ఆనందమయ తత్త్వమూర్తీ వినాయకుడు, మనసారా కొలవాలేగానీ, కోరిన కోరికలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే సిద్ధి దేవత గణపతి. ఎన్నో సంవత్సరాల నుంచీ వస్తున్న.. మన సాంప్రదాయల్లో ఒక ముఖ్య అధిదేవతగా పూజింపబడే దేవత గణపతి. నేటి వరకు ప్రతి పనికీ వినాయకుడి ననుసరించి, విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం ‘ఆదౌ పూజ్యో గణాధిపః’ అంటూ గణపతిని మొదటగా ఆరాధించడం జరుగుతుంది.
వినాయక చవితి చేసుకోవడం అంటే కేవలం వినాయకుడికి పూజలు చేయడం అనుకోకూడదు. ఇది పూర్తిగా ప్రకృతి పండగ. వినాయక చవితి భాద్రపద నెలలో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు కురుస్తాయి. వానలతో భూదేవి పులకిస్తుంది. ఆకులు, పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. ఈ కాలంలోనే దొరికే కొన్ని పువ్వులు ఆకులు, పండ్లు….అన్నీ ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21రకాల పత్రి, గరికతో గణనాధునికి పూజలు చేస్తాం.
భాద్రపద మాసంలో పంటలన్నీ కాయల రూపంలోనే ఉంటాయి. ఆ పచ్చికాయలనే వినాయకుడికి నివేదిస్తాం. వానాకాలానికి అవసరమైన ఆహారమే నైవేద్యంగా పెడతాం. ‘‘ ప్రకృతి ఎలా ఉంటే దానిని అలాగే ఆస్వాదించండి, పూజించండి ”అనే సందేశం గణపతి పూజలో ఉంది.
చెరకుగడలు, వెలగపండ్లు, మొక్కజొన్న కంకులను ప్రసాదంగా వినాయకుడికి నివేదిస్తాం. అటు ఆకులు ఇటు పూలు పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఈ ప్రకృతిలో మనమూ భాగమేనన్న అభిప్రాయం కలుగుతుంది. కాబట్టి గణపతి పూజను ప్రకృతి సంబురంగానే చూడాలి. సకల ప్రాణాలు మట్టిలోంచే వచ్చాయని, చనిపోయాక ప్రతి జీవి మట్టిలో కలవాల్సిందేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక పార్వతి వినాయకుడిని ఒంటి మీది నలుగుమట్టితోనే తయారు చేసి ప్రాణం పోస్తుంది. అందువల్ల మనం వినాయకుడ్ని పూజిస్తే సాక్షాత్తూ ప్రకృతిని పూజించినట్లే అవుతుంది. కనుక మనం మట్టితో తయారు చేసిన వినాయకుల విగ్రహాలను పూజిస్తేనే మనకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే విష పదార్థం.. దాంతో తయారు చేసిన విగ్రహాలను పూజించడం వల్ల మనకు ఎలాంటి ఫలితం దక్కదు. కనుక మట్టి విగ్రహాలనే పూజించాలని కోరుకుందాం.
సహజంగా ప్రకృతిలో సహజంగా దొరికే ఆకులు అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వాటిలో కొన్ని అనేక రకాల అనారోగ్యాలకు ఔషదాలుగా కూడా ఉపయోగపడతాయి. ఆకులు, అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకుల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. అనారోగ్యాలొచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే వైద్యం చేయవచ్చు. పూజల్లో భాగంగా చేసే హోమంలో, ఎండిన ఔషధ మొక్కల బెరళ్లను, కాండాలను సమర్పిస్తాం.
ప్రకృతితో పూజ
వినాయక చవితి రోజున చేసే గణపతి పూజలో పత్రితో చేసే పూజ ప్రధానమైనది. ప్రకృతికీ, వినాయకునికీ ఉన్న సంబంధాన్ని ఈ పత్రి పూజ తెలియజేస్తుంది. వినాయకుణ్ణి మొత్తం ఇరవై ఒక్క రకాల ఆకులతో పూజిస్తారు. ఆ పత్రాలు ఏమిటంటే… మాచీపత్రం, బృహతీ పత్రం (వాకుడు ఆకు), బిల్వ పత్రం (మారేడు), దూర్వాయుగ్మం (గరిక), దుత్తూర పత్రం (ఉమ్మెత్త), బదరీ పత్రం (రేగు), అపామార్గ పత్రం (ఉత్తరేణి), తులసీ పత్రం, చూత పత్రం (మామిడి), కరవీర పత్రం (గన్నేరు), విష్ణుక్రాంత పత్రం, దాడిమీ పత్రం (దానిమ్మ), దేవదారు పత్రం, మరువక పత్రం (మరువం), సింధువార పత్రం (వావిలి), జాజీ పత్రం (జాజి మల్లి), గండకీ పత్రం (లతాదూర్వ), శమీ పత్రం (జమ్మి), అశ్వత్థ పత్రం (రావి), అర్జున పత్రం (మద్ది), అర్క పత్రం (జిల్లేడు). వినాయకుణ్ణి ‘దూర్వాలు’… అంటే గరిక పోచలతో… అర్చిస్తే ఆయన ప్రసనుడై, వంద యజ్ఞాలు చేసిన దానికన్నా ఎక్కువ ఫలాన్ని అనుగ్రహిస్తాడని నమ్మకం.
విఘ్నరాజుకు ప్రకృతితో ఉన్న అనుబంధం నవరాత్రుల తర్వాత వినాయకుడి విగ్రహాలను చెరువుల్లోనూ, నదుల్లోనూ, సముద్రంలోనూ నిమజ్జనం చేయడం కూడా ఈ అనుబంధాన్ని సూచిస్తుంది. మనమంతా ప్రకృతి ప్రసాదించిన వన సంపదతో.. ఫల సంపదతో ఈ వినాయక చవితిని తోచిన రీతిలో జరుపుకుందాం.
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
చంద్రగిరి శిఖరం
రేడియో హీరోయిన్ శారదా శ్రీనివాసన్….