September 29, 2023

నీడల సయ్యాటే తోలుబొమ్మలాట..

ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోని ప్రతిభ తోలుబొమ్మలాట ఆడించేవాడి మీద ఆధారపడి ఉంది. ఈ ఆటంతా సంగీతం, నాట్య ప్రదర్శనాభరిత కళారూపంగా సాగుతుంది. అందుకనే ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొంది ఉన్న కళగా పేరు పొందింది.

తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. మన పురాణాలు, కావ్యాలలో వర్ణించబడిన పాత్రలకు రూపాన్నిచ్చి స్వయంగా వాటిని తయారుచేస్తారు. అలా తయారు చేసిన తోలు బొమ్మలతో రకరకాల విన్యాసాలు చేయిస్తారు. ఓ తెల్లని తెరమీద జరిగే నీడల సయ్యాటే ఈ తోలుబొమ్మలాట. నిజానికి ఇది ఒకప్పటి ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని పంచిన వినోద కాలక్షేపం. అప్పట్లో ఎంతో ఆదరణపొందిన ఈ కళ ఇప్పుడు తెరమరుగవుతుంది. మన సంస్కృతిలో పుట్టిన ఈ కళ.. మన దేశంలో ఆదరణ తగ్గి విదేశాలలో మాత్రం ఇది ట్రెండీగా మారిపోయింది. ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఆటను మనవాళ్ళు పూర్తిగా మరిచిపోయారు.

రామాయణ మహాభారతాలను తెరల మీద ఆడుతున్న తోలుబొమ్మల్లో చూసి మురిసేవాళ్ళు తగ్గిపోయారు. ఆ జీవంలేని బొమ్మలతో జీవనిబద్దమైన ఒక దృశ్యాన్ని ప్రదర్శించడంలోని ప్రతిభ తోలుబొమ్మలాట ఆడించేవాడి మీద ఆధారపడి ఉంది. ఈ ఆటంతా సంగీతం, నాట్య ప్రదర్శనాభరిత కళారూపంగా సాగుతుంది. అందుకనే ఈ కళ మొత్తం భారతీయ జానపద కళారూపాల్లోనే విశిష్ట స్థానాన్ని పొంది ఉన్న కళగా పేరు పొందింది. అంతే కాదు నృత్య కళ నుంచీ నాటక రంగం వైపుకు కళాకారుడి అడుగులు పడేందుకు తోలుబొమ్మలాట ఎంతగానో సహాయపడింది. ఈ కళను ప్రదర్శించడంలో ఉన్న పట్టు వారికి నాటకరంగంలో రాణించేలా చేసింది. తొలుబొమ్మలాట పుట్టుపూర్వోత్తరాల మీద చాలా కథలు ప్రచారంలో ఉన్నా అందులో ఈ కథనే ఎక్కువగా చెపుతారు. పూర్వం రాజాస్థానంలో రాజుకు వినోదాన్ని పంచడానికి కళాకారులు తోలుబొమ్మలను తయారుచేసి, తెల్లటి పంచెను తెరగా అమర్చి, దానిపైన దీప కాంతితో బొమ్మల నీడలను పడేటట్లు చేసి బొమ్మలాటను ప్రదర్శించేవారు. ఈ విధంగా తోలుబొమ్మలాట పుట్టిందని, ఆ ఆట పండితుల చేత మరిన్ని మెరుగులు దిద్దబడిందని చెపుతారు. ముఖ్యంగా ఈ ఆట ఆంధ్రరాష్ట్రంలో పురుడుపోసుకున్నదని అంటారు.

అయితే ఈ తోలుబొమ్మలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాచీన ఓడరేవులైన కళింగపట్నం, భీమునిపట్నం, కోరంగి, మచిలీపట్నం, వాడరేవు, కొత్తపట్నాల నుంచి విదేశాలకు భారతీయులతో పాటు వెళ్ళాయి. పాశ్చాత్యదేశాలలో జరిగే ఉత్సవాలలో తోలుబొమ్మలను ప్రదర్శించడాన్ని బట్టి చూస్తే ఈ కళకు ఇతర దేశాల్లో బహుళ ఆదరణ లభించిందని తెలుస్తున్నది. పర్షియా, టర్కీ ల మీదుగా గ్రీసు దేశంలో ప్రవేశించిన తోలుబొమ్మలు, గ్రీసులో నూతన రూపం సంతరించుకుని ఉత్తరాఫ్రికా లోని ముస్లిం దేశాలకు వ్యాపించింది.

రంగస్థలంపై పొడవాటి గుంజలపై తెల్లటి వస్త్రాన్ని లేదా పంచెను ముందు భాగంలో గట్టిగా లాగి కడతారు. తెరను భూమి నుండి నిలువుగా ఉండకుండా కొంచెం ఏటవాలుగా కడతారు. ఈ విధంగా కట్టడం వల్ల బొమ్మలను ఆడించేటప్పుడు బొమ్మలకు కాళ్ళు అడ్డుతగలకుండా ఉంటుంది. తోలుబొమ్మల ప్రతిబింబాలు సరిగ్గా తెరపై పడడానికి తెరలోపలి నుండి పూర్వం కాగడాలు ఉపయోగించేవారు. అయితే విద్యుత్ సౌకర్యం అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ కాంతిని ఇచ్చే విద్యుత్ బల్బులను వాడుతున్నారు. ప్రదర్శన సంబంధమైన కదలికలకు అనుగుణంగా ప్రధాన గాయకుడు పాడుతూ వుంటే, మిగిలినవారు వంతలుగా పాడుతారు. వంతల్లో స్త్రీలు ప్రధానంగా ఉంటారు. రాగంతీయడం, ముక్తాయింపు, సంభాషణ ధోరణిలో స్త్రీగొంతు ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇందులో స్త్రీ పాత్రలకు స్త్రీలే పాడతారు. మైకులు వంటి సాధనాలు లేకుండా విశాలమైన మైదానంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే వారి గొంతు స్థాయిని ఊహించుకొనవచ్చును. వీరికి హార్మోనియం శృతిగా ఉంటుంది. తాళాలుంటాయి. వాయించే వ్యక్తులు కూడా వెనుక కూర్చొని వంత పాడుతుంటారు. అంతే కాదు, వాళ్ల కాళ్ళక్రింద బల్లచెక్కలుంటాయి. ఆయా ఘట్టాలననుసరించి ఈ చెక్కలను తొక్కుతుంటారు. ముఖ్యంగా రథాలు, గుఱ్ఱాలు, యుద్ధఘట్టాలలో ఈ చెక్కలు టకటకా త్రొక్కుతుంటే మంచి రసవత్తరంగా ఉంటుంది. నగారా మోతలకు ఖాళీ డబ్బాలు ఉపయోగిస్తారు. ఉరుములు ఉరిమినట్టూ, పిడుగులు పడ్డట్టూ డబ్బాలు మ్రోగిస్తారు. ఏ వ్యక్తి బొమ్మలను ఆడిస్తాడో ఆ వ్యక్తి తానే పాడుతూ, పాటకు అనుగుణంగా బొమ్మను ఆడిస్తాడు. రెండు బొమ్మలను ఆడించే సమయంలో బొమ్మలమధ్య వచ్చే పోరాటంలో రెండు బొమ్మలను చేతితో కొట్టిస్తాడు. అదే సమయానికి క్రింది బల్లచెక్క టకామని నొక్కుతాడు. ఈ సమయంలో మిగిలిన వంతదారులు కావలసిన అల్లరి, హంగామా చేస్తారు. ఒక యుద్ధఘట్టం వచ్చిందంటే డోళ్ళూ, డబ్బాలూ, ఈలలూ, కేకలతో బీభత్సం సృష్టిస్తారు. మారిన కాలంతో మన జీవనశైలిలో మార్పులు సంభవించినట్టే ఆధునికతకు అద్దం పడుతున్న మన జీవన విధానాలు కూడా మారుతూ వస్తున్నాయి. మరింత మార్పు సంతరించుకునైనా ఇప్పటి వారు తోలుబొమ్మల కళను మన ముందుతరాలకు గర్వంగా మన కళ అంటూ వారికి పరిచయం చెయ్యాలని ఆశిద్దాం.

%d bloggers like this: