September 29, 2023

స్నేహ బంధం..

ఆత్మీయ స్పర్శే స్నేహం.. నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడు ఉంటుంది.. ఒంటరిలోను, ఓటమిలోనూ తోడై నడుస్తుంది. కన్నీరు తుడుస్తుంది, కష్టాల్లో ధైర్యం చెబుతుంది..

ఈ సృష్టిలో తల్లితండ్రులు, తోబుట్టువులు, నా అన్నవాళ్ళు లేనివాళ్ళు ఉంటారేమో గానీ.. స్నేహితులు లేనివారు గానీ, స్నేహం తెలీని వారు గానీ ఉండరు.. గుండె ఊసుల్ని పంచుకునేది మన ప్రాణ నేస్తమే.. ఏ స్నేహమైనా కాలం గడిచేకొద్దీ గట్టిబంధంగా మారుతుంది. వీటన్నింటిలోకీ చిన్ననాడు మొలకెత్తిన స్నేహం మరీ బలంగా మారుతుంది. అమ్మనాన్నల అనురాగాన్ని మించిన ఆప్యాయతను పంచే మధురమైన బంధం స్నేహం. అన్నా చెల్లెల అనురాగాన్ని మించిన అనురాగ బంధం స్నేహం. ఒక్క స్నేహితుడు ఉన్నా జీవితం ఎంత ఆనందంగా మారిపోతుందో మాటల్లో చెప్పలేం. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఆనందాన్ని, కష్టాన్ని పంచుకునే దగ్గరి సంబంధం స్నేహితుల దగ్గరే ఉంటుంది. చొరవతో కూడిన దగ్గరతనం ఒక్క స్నేహితుల దగ్గరే సాధ్యం అవుతుంది. మరి అలాంటి స్నేహ బంధం గురించి ఈ స్నేహితుల దినోత్సవం రోజున కాస్త గుర్తుచేసుకుందామా…
మనకంటూ ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనసు తెలుసుకునే స్నేహితులు లేని వాళ్ళు నిరుపేదల కిందే లెక్క. స్నేహం అద్భతమైనది.. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. వయసుతో నిమిత్తం లేని మైత్రిలో ఎంతటి బాధనైనా తేలిక చేయగల శక్తి ఉంది. ఊహ తెలిసినప్పటి నుంచీ చివరిమజిలీ వరకూ జీవితంలోని అన్ని దశల్లోనూ ప్రతి ఒక్కరికీ స్నేహితులు ఉంటారు. కొందరికి ఒక్కరో ఇద్దరో మాత్రమే జీవితాంతం ఉంటే, మరికొందరికి మాత్రం ఆ జాబితాలోకి ఎప్పటికప్పుడు కొత్తవాళ్ళూ చేరుతుంటారు. అంతే తప్ప స్నేహం లేకుండా జీవితం ఉండదు. స్నేహంలో మాత్రమే ఒకరి నుంచీ ఒకరు ఏదీ ఆశించకుండా ఎదుటివారిలో తప్పు ఒప్పులను సైతం సమంగా స్వీకరించే గుణం చూస్తాం. ఒకరంటే ఒకరికి విడదీయరాని విడిపోని బంధం స్నేహబంధం మాత్రమే…
గాడాంధకారం అలముకున్నా.. నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినా.. భరించలేని కష్టం బాధపెట్టినా..నీ కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.. నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడు ఉంటుంది.. ఒంటరిలోను, ఓటమిలోనూ తోడై నడుస్తుంది. కన్నీరు తుడుస్తుంది, కష్టాల్లో ధైర్యం చెబుతుంది.. అలాంటి మైత్రి లోని మాధుర్యం చెప్పడానికి మాటలు చాలవు.
ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు.. సంతోషాన్నయినా, విషాదాన్నయినా పంచుకునేది స్నేహితుల దగ్గరే. అందుకే శత్రువు ఒక్కడైనా ఎక్కువే… స్నేహితులు వందమంది అయినా తక్కువే అని స్వామి వివేకానంద అంటారు.. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి, మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలోనూ ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు..1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల రోజు గా ప్రకటించింది. 1935వ సంవత్సరం ఆగస్ట్ మొదటి శనివారం రోజున అమెరికా ప్రభుత్వం చేతిలో హతమైన తన స్నేహితుడిని మర్చిపోలేని మరో స్నేహితుడు ఆ తరువాత రోజైన ఆదివారంనాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి చలించిపోయిన అమెరికా ప్రభుత్వం ఆగస్ట్ మొదటి ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే గా ప్రకటించింది.
స్నేహం అనేది ఒక మధురమైన అనుభూతి.. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ స్నేహితులు ఉండని వారు ఉండరు.. ప్రస్తుత కాలంలో ట్రెండ్ మారుతున్నా ఫ్రెండ్షిప్ డే ప్రాముఖ్యత మాత్రం తగ్గడం లేదు.. నిస్వార్థమైన స్నేహాన్ని ఆస్వాదిస్తున్న స్నేహితులు మరోసారి ఫ్రెండ్షిప్ డేకి గ్రాండ్ వెల్కం చెబుతున్నారు.. ఒకప్పుడు ఫ్రెండ్షిప్ డే రోజు గ్రీటింగ్ కార్డులతో శుభాకాంక్షలు చెప్పుకునే వారు.. ఇప్పుడు గ్రీటింగ్స్ చెప్పుకునే పద్దతి మారింది.. మెసేట్ రూపంలో శుభాకాంక్షలు చెప్పుకుంటూ తమ.. ఆనాటి అనుభూతులను, సరదాలను గుర్తు చేసుకుంటున్నారు.. మరి ఆలస్యం ఎందుకు మీరూ మీ బాల్య స్నేహితుల నుంచి ఇప్పటివరకూ మీకై స్నేహాన్ని అందించిన ప్రతి ఒక్క స్నేహితుడినీ స్నేహితుల దినోత్సవంగా తలుచుకోండి.. వీలైతే కలుసుకోండి మరి.

%d bloggers like this: