ప్రకృతిని చిత్రకారుడు చూసే దృష్టికోణం భిన్నంగా ఉంటుంది. చూసే ప్రతి వస్తువులోనూ ప్రత్యేకతను చూడగలిగి దానికి రంగులద్ది కెన్వాసు మీద చిత్రంగా మలచగలగడం ఒక్క ఆర్టిస్ట్ కే సొంతం. పెన్సిల్ చిత్రాలు, సినిమా పోస్టర్ లు, దేవుళ్ళ చిత్రాలతో దీవెనలు అందుకుని తన ఉలితో రాతికి ప్రాణం పోయగల ప్రతిభ..ఈ ఆర్టిస్ట్ సొంతం. ఎల్లలు దాటిన ప్రతిభా పాటవం తెల్లవాడిని మెప్పించిన చిత్రలేఖనం.. మహనీయుల చిత్రాలతో మన్ననలు… వెంకన్న నేత్రదర్శనం ఈ కుంచె చలవే.. ఆయనే ఏలూరి శేషబ్రహ్మం. తన చేతిలో రూపుదిద్దుకునే ప్రతి చిత్రానికి ఓ ప్రత్యేకతను ఇస్తూ చిత్రలేఖనంలోనూ, అటు శిల్పిగా అందరి ఆర్టిస్ట్ లకూ కాస్త భిన్నంగా తన ప్రతిభను చాటుకున్నారు శేషబ్రహ్మం.

కనెక్టెడ్ ఇండియన్ శేష బ్రహ్మం గారి గురిచి తెలుసుకుంటూ జరిగిన సభాషణ ఇది:
- కుంచెతో బొమ్మలు వేయగలను అని మొదటిసారి ఎప్పుడు మీ మీద మీకు నమ్మకం కలిగింది..
ఐదవ తరగతిలో బొమ్మలపై నాకున్న ఆసక్తిని గమనించి మా నాన్న కెమెల్ రంగు బిళ్ళల సెట్ కొనిచ్చారు. వాటిని చూడగానే చాలా ఆశ్చర్యంగా, సంతోషంగా అనిపించింది. వాటితో ఒక ప్రకృతి దృశ్యం గీసాను. ఆ పెయింటింగ్ ను మా స్కూల్ ఇన్ఫెక్షన్ కి వచ్చిన సుందర్రావు గారు అని డి ఈ ఓ గారికి మా హెడ్ మాస్టర్ జయరావమ్మ గారు బహుకరించారు. ఆయన దానిని చూసి, నన్ను పిలిపించి ‘చక్కగా వేస్తున్నావు, ఇంకా బాగా సాధన చెయ్యి’ అన్నారు. పిల్లలందరూ చప్పట్లు కొట్టడంతో నాకు పెయింటింగ్స్ వెయ్యగలనని మొదటిసారి నమ్మకం వచ్చింది.
- పెయింటింగ్ లో మీ మొదటి గురువు ఎవరు..?
నిజానికి నా మొదటి గురువు మా నాన్నగారే, మా పూర్వీకులందరు కళాకారులు కావడంతో వృత్తి రీత్యా మా నాన్న వడ్రంగి అయినా ఆయన డ్రాయింగ్స్ బాగా గీసేవాడు. తొలిరోజులలో ఎలా వెయ్యాలో ఆయన చెప్పేవారు, తరువాత మా ఊరు ఒంగోలులో జే. వెంకటేశ్వర్లు, రామకృష్ణ గారి దగ్గర బేసిక్ డ్రాయింగ్ అలాగే పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను. - బొమ్మలు వేయడానికి కుటుంబ వాతావరణం ఏలా సహకరించేది.
నేను బొమ్మలు నేర్చుకునే మొదటి రోజులలో నాతో పాటు కొంతమంది స్నేహితులు బాగా బొమ్మలు వేసేవారు, కానీ వాళ్ళ ఇళ్లల్లో కోప్పడటమో, కొట్టడమో జరిగి డ్రాయింగ్స్ చెయ్యడం వదిలేశారు. కానీ మా ఇంట్లో నా సాధనకు మంచి వాతావరణం ఉండేది. నా తల్లిదండ్రులకు కళలపై అవగాహన ఉండటం నాకు కలిసొచ్చింది. ఆరోజు నుండి ఈరోజు వరకు వారి సంపూర్ణ సహకారంతోనే నేను బొమ్మలు వేయగలుగుతున్నాను. అలాగే మా మేన మామ సుబ్బారావు కూడా కళాకారుడు అవ్వడంతో నాకు మంచి ప్రోత్సాహం లభించింది. - మొదటిసారిగా ఆర్టిస్ట్ గా వృత్తిని ఎంచుకుని అటుగా వెళ్ళిన సందర్భం ఏది..
ఖచ్చితంగా ఫుల్ టైం ఆర్టిస్ట్ అవ్వాలని గాని, అవ్వచ్చనిగాని నాకు తెలియదు. మా ఇంటి ఆర్ధిక పరిస్థితులు ఈ దిశకు నన్ను నడిపించాయి. పదవ తరగతి తరువాత ఇంటర్మీడియట్ కాలేజీలో నాకు సీటొచ్చింది. కానీ ఫీజు కట్టడానికి 30 రూపాయలు లేక మా నాన్న ఇబ్బంది పడ్డాడు. ఫీజు కట్టాల్సిన చివరి రోజు సాయంత్రం వరకు ఆయన ప్రయత్నించి డబ్బులు దొరకక ఆ విషయం నాకు చెప్తే బాధ పడతానని భావించి ‘నువ్వు బొమ్మలు బాగా వేస్తున్నావుగా అటు వైపు వెళ్తావా’ అన్నాడు. అప్పటి వరకు సెలవురోజులల్లోనే ప్రాక్టీస్ చేసే నాకు ఇక ప్రతిరోజూ రంగులతో గడపచ్చు అన్న ఊహ ఎంతో సంతోషాన్నిచ్చింది. వెంటనే సరే అని డ్రాయింగ్ సాధనలో మునిగిపోయాను. - ఆర్టిస్ట్ గా మీ తొలి సంపాదన ఎంత తీసుకున్నారు.
హైదరాబాద్ ఫైనార్ట్స్ మొదటి సంవత్సరం చదువుకునేప్పుడు మా ఇంటి దగ్గర ‘షాలూ దీదీ’ అనే ఆమె ఒక ఫ్లవర్ బొమ్మ పెన్సిల్ డ్రాయింగ్ అడిగింది, వేసిచ్చాక పది రూపాయలు నా చేతిలో పెట్టింది. ఇంత చిన్న బొమ్మకు పది రూపాయలా అని సంతోష పడ్డాను. ఆ నోటు ఇప్పటికి నా దగ్గర జాగ్రత్తగా వుంది. ఆ తరువాత చదువుకుంటూ 300 రూ కి చాలా కాలం పార్ట్ టైం జాబ్ చేసాను. - ఆర్టిస్ట్ గా రాణించడానికి మీకు ఫీడ్ చేసిన ఆర్టిస్ట్ లు ఎవరైనా ఉన్నారా.
చాలా మందే ఉన్నారు. నా క్లాస్ మేట్ వెంకటేశ్వరరావు, గంగాధర్ సార్, మోహన్ గారు, ఆంజనేయలు ఇంకా మరికొందరు ఉన్నారు. - మీకు సాహిత్యం మీద మక్కువ ఉన్నట్టుంది.. అటుగా అడుగులు ఎప్పుడు పడ్డాయి.
చిన్నప్పటినుండి కథల పుస్తకాలు చదవడం చాలా ఇష్టం. ఆ తరువాత రష్యన్ సాహిత్యం బాగా నచ్చింది. స్కూల్ రోజులలో ఏదైనా పిరియడ్ సార్ రానప్పుడు పిల్లలు గోల చెయ్యకుండా ఉండేందుకు నాతో కథలు చెప్పించేవారు. అలా చదివిన కథలకు కొంత జోడించి ఆసక్తి కలిగించేలా చెప్పడం అలవాటు అయ్యింది. ఇటీవల మళ్ళీ సాహిత్యం చదవడం మొదలు పెట్టాను. అలాగే ఇటీవల కాలంలో కొన్ని నా అనుభవాలు, వేరే వారు చెప్పగా విన్నవి కథల రూపంలో రాయడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు నచ్చిన రచయితలు అలెగ్జాండర్ కుప్రిన్. ఆర్ కె నారాయణ. - మీరు అభిమానించే ప్రస్తుత ఆర్టిస్ట్ లు ఎవరు.
క్షమించండి ఈ విషయం స్పషంగా చెప్పలేను. చాలామందే ఉన్నారు. - ఫైన్ ఆర్ట్స్ వైపు వెళ్ళడం మీకు ఎంత వరకూ సహాయ పడిందంటారు.. అక్కడ ఏమైనా నేర్చుకున్నారా.
నాకు సరైన మార్గం చూపింది ఫైనార్ట్స్ కాలేజీనే. కళలయొక్క విస్తృతి ఎంత పెద్దది అనే విషయం కాలేజీలో చేరాకే తెలిసింది. ఎందరో చిత్రకారుల పరిచయం, పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలి అని తెలిసింది ఇక్కడే. ఇక నా సగం జీవితం లైబ్రరీలోనే గడిపాను. అప్పుడప్పుడు వచ్చి డెమోలు ఇచ్చే గొప్ప చిత్రకారులనుండి టెక్నీక్స్ ను అక్కడే తెలుసుకున్నాను. అందుకే 5 ఏళ్ళ కోర్సుని 8 ఏళ్ళు చదివాను. మనసులో ఉన్న భావాలకు ఒక రూపం ఇవ్వడాన్ని అక్కడే నేర్చుకున్నాను. - మైఖెల్ జాక్సన్ చిత్రాన్ని గీసిన సందర్భం వచ్చిన రెస్పాస్స్ మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది.. అంటే మీలో ధైర్యాన్ని నింపింది అనుకోవాలా..
ఆ సంఘటన చాలా యాదృచ్చికంగా జరిగింది. ఒకసారి ఆయన చిన్న పెయింటింగ్ గీసి పంపాను. బావుందని వారి ఆఫీసు లో తగిలించారనీ వారి నుండి రిప్లై రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మన వర్క్ బాగుంటే ఎంతటి పెద్దవారైనా స్పందిస్తారు అనే విషయం తెలిసింది అప్పుడే. - వెంకటేశ్వరుని నేత్ర దర్శనం పెయింటింగ్ వేసారు కదా..దాని వెనుక కథ చెప్పండి.
1998 లో వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం పెయింటింగ్ వేయించాలని తిరుమల దేవస్థానం నిర్ణయించుకుని చాలా మంది కళాకారులను పిలిపించారు. వారు సెలెక్ట్ చేసిన ముగ్గురు చిత్రకారులలో నేను ఒకడిని. నాలుగు గురువారాలు శ్రీవారి సన్నిధిలో ఉండి ఆ చిత్రాన్ని పూర్తి చేసాను. మూల విరాట్ వేంకటేశ్వరుని మకర తోరణం మా ముత్తాత యేలూరి లక్ష్మణాచార్యులు చేసినది. మరలా నేను స్వామి వారి నేత్ర దర్శనం పెయింటింగ్ చెయ్యడం ఒక అపూర్వ అనుభవం. - ఇప్పుడు ఏం చేస్తున్నారు.. కొత్త ప్రయోగాలు ఏమైనా మొదలు పట్టారా..
ప్రస్తుతం ఒక ఎక్సిబిషన్ కోసం వర్క్స్ మొదలుపెట్టాను. సామాన్యుల జీవితపు అంశాలను హైపర్ రియలిజం శైలిలో ఆయిల్ కలర్స్ తో మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం అవి స్కెచింగ్ దశలో ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ పూర్తి అవ్వడానికి సంవత్సర కాలం పట్టవచ్చు.
శేషబ్రహ్మం గారు, తన వైవిధ్య కళానైపుణ్యంలో మరిన్ని ఉన్నత ఆశయాల దిశగా పయనించాలని మనమందరం కోరుకుందాం. మన కళాకారుల అభివృద్ధి మన దేశ అభివృద్ధిలో భాగమే.
– శ్రీశాంతి దుగ్గిరాల
ఇవి శేషబ్రహ్మం గారి కళానైపుణ్యానికి నిదర్శనాలు














అద్భుతమైన కళాకారుని పరిచయం. పాఠకులకు కళల పై అవగాహన ఆసక్తి కలిగించే ముఖాముఖి. అభినందనలు
మీ ఆశీస్సులు, మాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి మరికొందరిని పరిచయ చేసేందుకు.
Very good introduction of artist Sesha Brahmam garu….beautiful works.
Thank you sir!
Simple and best article on versatile artist Sesha Brahmam Article supporting images are simply superb Congrats Sreesanthi Duggirala .best wishes.
ధన్యోష్మి
లెజెండ్ బ్రహ్మంగారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న తన తోటి కళాకారులకు తనవంతుగా ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూనే వుంటారు.. గొప్ప మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి గురించి వివరంగా తెలియపరచడం చాలా సంతోషకరం
I know to him personally. But I knew the new things about Brahmam in this article. Good interview. Thank you.