మనిషి ప్రకృతికి ఏమిస్తున్నాడు.. ప్రకృతి మనిషి నుండీ ఏం ఆశిస్తుంది.. ఇదంతా పెద్ద కథలా ఉన్నా.. జరిగే విపత్తును తెలుసుకునే ఆలోచన చేయడం లేదు. చుట్టూ ఉన్న వనరులతో జీవించడం చేతకాని మానవుడు కొత్తగా ఏదో ఆశిస్తున్నాడు ఈ ఆశించడం అనేది.. మనిషిని విపత్తులోకి నెట్టేస్తుంది. కలుషితమైన నీరు, వాతావరణ కాలుష్యం, అవసరం లేకున్నా వాడుతున్న ఫ్లాస్టిక్ వ్యర్థాలు, మంచి చేసే చెట్ల నరికివేత.. అంతరించిపోతున్న అడవులు ఇలా ప్రతి పనీ మనిషి జీవించే రేటును తగ్గిస్తూ వస్తుంది. ఇదంతా చాలావరకూ తెలిసి జరుగుతున్న తప్పిదమే… కాదంటారా…
మనిషికి ప్రకృతి నుంచీ ఏం కావాలి. ఇదే సరిగా తెలుసుకోలేకపోతున్నాడా.. మారుతున్న జీవన శైలితో.. చుట్టూ ఉన్న రోగాలు, అంటువ్యాధులు, పోషకాహార లోపం, జీవన విధానంలో మార్పులు..వెరసి తరుచుగా అనారోగ్యాలు.. ఇవన్నీ మనిషిని చిన్న విపత్తుకే కుంగిపోయేట్టు చేస్తున్నాయి. కొన్ని వందల సంవత్సరాలుగా జంతువులతో సమానంగా పుట్టి జీవించిన మనిషి తనకున్న జ్ఞానాన్ని పెంచుకుంటూ తను ప్రకృతిని మించిన వాడుగా ముద్రవేయించుకున్నాడు..ఆకలి వేస్తే ఆ జంతువులనే వేటాడి గడుపుకునే తెలివితేటలను పొందాడు..నెమ్మదిగా అదే తెలివితో కేవలం వేటమాత్రమే కాకుండా తను వేటాడి తినే జంతువులను తినడానికి మాత్రమే పెంచడమూ నేర్చాడు. తనలో తాను ఓ కాంతిని వెలిగించుకుని తన చుట్టూ ఉన్న ప్రకృతిని ముడి చమురుగా చేసుకుని తన ఉనికి ని చాటుకోవడానికి తన లోకాన్ని మరింత పధిలం చేసుకున్నాడు. ఇలా తన స్వార్థం చూసూకోవడం నేర్చుకున్న మనిషి ప్రకృతిని బలిచేసి మాత్రమే జీవిస్తున్నాడు. నీరు, గాలి, ప్రకృతిలో భాగాలైన చెట్లను పచ్చదనాన్ని అన్నింటినీ నెమ్మదిగా కలుషితం చేస్తున్నాడు.వీటితో జీవనం సాగిస్తూనే తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నాడు.
కానీ మనిషి గుర్తుంచుకోవలసింది ఏమిటంటే ఆ మనుషులు ఆరోగ్యంగా బావుండాలంటే ప్రకృతిలోని స్వచ్ఛత ఎప్పటికీ అలానే ఉండేట్టు ప్రాణవాయువును, త్రాగేనీరు, తినే తిండి వీటన్నీటినీ ముఖ్యంగా కాపాడుకోవాలి. కలుషితమైన ప్రకృతిలో జీవించడం వల్ల జీవితకాలం రేటు రోజురోజుకూ కోల్పోతున్నాడని గ్రహించాలి.. అసలు అభివృద్ధి చుట్టూ తిరుగుతున్న మానవుడు కనిపెట్టిన ఎన్నో ఆవిష్కరణలు వాహనాలు, ప్లాస్టిక్ ఇలా పర్యావరణానికి చేటు చేసే చాలా వినాశనాలను భూమి మీదకు తీసుకువచ్చాడు మానవుడు.
ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి మనిషికి జీవనాధారమైనది. మనకు ఊపిరినిచ్చే గాలి పచ్చని చెట్లనుండే లభిస్తుంది. మన ఆకలి బాధను తీర్చేది కూడా ప్రకృతిమాతే. అటువంటి ప్రకృతిని మనం అలసత్వంతో చూడకూడదు. ప్రకృతిలో నివసించే జీవరాశులన్నిటిలో సమతుల్యత ఉన్నప్పుడు మానవ జాతి ఆరోగ్యదాయకంగా ఉండగలుగుతుంది. ప్రకృతి ఏ ఒక్కరి సొత్తో అనుకోవడం చాలా పొరపాటు. సమస్త ప్రాణికోటికి నిలయమైనది ప్రకృతి. ప్రకృతినుంచి లభించే సహజ సంపదగానీ, సహజ వనరులు గానీ జీవరాశులన్నీ పొందదగినవి. అటువంటి సహజ సంపదను గానీ సహజ వనరులనుగానీ కొల్లగొట్టడం.. నిర్వీర్యం చెయ్యడం మానవ జాతికి అనర్థదాయకమవుతుంది.
కాలుష్య రహిత వాతావరణాన్ని ఆహ్వానించాలి. ప్రతివారు వారు నివసించే ప్రదేశంలో పచ్చని మొక్కలు నాటి స్వచ్ఛ భారతానికి ఊతమివ్వాలి. పెరిగిపోతున్న భూతాపాన్ని సహృదయంతో ఆకళించి పర్యావరణాన్ని పరిరక్షించి పచ్చదనాన్ని పెంపొందించాలి. వృక్షో రక్షతి రక్షితః’ అన్న మాటల సత్యాన్ని గుర్తెరిగి మసలుకోవడం శ్రేయోదాయకం. వృక్షాలను నాశనం చెయ్యడం కాకుండా వృక్ష సంపదను పెంపొందించేందుకు అడవుల పరిరక్షణకు కావలసిన చర్యలను చేపట్టాలి. ప్రకృతి పరిరక్షణే మానవ జాతి సౌభాగ్యానికి మూలాధారమని గ్రహించాలి
More Stories
బామ్మ కథ “బంగారు మురుగు”
చంద్రగిరి శిఖరం
రేడియో హీరోయిన్ శారదా శ్రీనివాసన్….