September 29, 2023

ప్రతి బొట్టునూ ఒడిసి పడదాం..

అవసరమున్నప్పుడే ఆలోచించే తీరు మార్చుకొంటే నీరు పుష్కలంగా లభ్యమయ్యే వీలు ఉంటుంది. ఒకటి నదీ జలాల సద్వినియోగం, రెండోది వర్షపు నీటి సంరక్షణ. మొదటి బాధ్యత ప్రాజెక్టులు, ఆనకట్టల రూపంలో ప్రభుత్వ చేతుల్లో ఉండగా.. రెండో అంశం ప్రతి పౌరుడు చేయదగిన పని.

నీటిని ఒడిసిపడితే ఎన్నో ప్రయోజనాలు.. మన మనుగడకు గాలి ఎంత ముఖ్యమో అంతే ముఖ్యపాత్ర నీటికీ ఇవ్వాలి. నీరు మనకి ప్రాణాధారం.. అటువంటిది నీటిని ఆదా చేయడం తెలీకుండా వృధా చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో వాతావరణంలో వస్తున్న మార్పులు, అడుగంటుతున్న భూగర్భ జలాలు.. ఇవన్నీ రాబోవు తరాలకు చేసే కీడు అంతా ఇంతా కాదు. మన బాధ్యతగా అటుగా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గాలి, నీరు అనేవి, మనిషికి అతి ప్రధానమైన జీవనాధారాలు. అందులోనూ మంచిగాలి, మంచినీరు, అనేవి మరింత అమూల్యమైనవి. అయితే గాలిని మనుషులు రకరకాలుగా కలుషితం చేస్తూ తమ ఆరోగ్యానికి తామే చేటు తెచ్చుకుంటున్నారు. ఇక నీటి విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యాన్నేచూపిస్తున్నారు. ఒక విధంగా గాలి కన్నా నీటి విషయంలో మరింత తప్పు చేస్తున్నారు. నీటిని నానారకాలుగా కలుషితం చేయడమేకాక అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకోలేక పోతున్నారు.

ఏ ఖనిజమైనా ఒకసారి వెలికి తీస్తే మళ్లీ లభించదు. భూగర్భజలం అలా కాదు. వర్షాలతో పునరుత్పత్తి అవుతుంది. నీటిని నిల్వ చేయటం ద్వారానే భూగర్భజలాలు పెంచుకోగలం. వర్షాకాలంలో కాలువలు, వాగుల నుంచీ నీరు పోతున్నప్పుడు ఒడిసిపట్టడం తెలియని మనం.. వేసవి వచ్చినప్పుడు మాత్రం నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతుంటాం.

అవసరమున్నప్పుడే ఆలోచించే తీరు మార్చుకొంటే నీరు పుష్కలంగా లభ్యమయ్యే వీలు ఉంటుంది. ఒకటి నదీ జలాల సద్వినియోగం, రెండోది వర్షపు నీటి సంరక్షణ. మొదటి బాధ్యత ప్రాజెక్టులు, ఆనకట్టల రూపంలో ప్రభుత్వ చేతుల్లో ఉండగా.. రెండో అంశం ప్రతి పౌరుడు చేయదగిన పని.

వర్షపు నీటిని ఒడిసి పట్టడంపై చైతన్యం లేకపోవడంతో 70 శాతం జలాలు వినియోగించే వ్యవసాయ రంగంలో వృథా నానాటికీ పెరిగిపోతోంది.  భూమి ఏర్పడినప్పుడు మంచి నీరు ఎంత ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది . కానీ, ఆ నీటిని ఉపయోగించుకునే జనాభా మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతోంది . దీనికితోడు పట్టణీకరణ, పారిశ్రామిక కాలుష్యం, మురుగు నీటి సమస్య కూడా స్వచ్ఛమైన నీటికి సవాలుగా మారాయి. ఇక నీరు నిల్వ అనే విషయంలో పట్టణాలు వెనకనే ఉన్నాయి. దీనికి పట్టణాల్లో భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చే ముందు తప్పని సరిగా వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఉండేలా చూసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

భవన నిర్మాణాలకు అనుమతినిచ్చేందుకు ఉన్న నియమ, నిబంధనల్లో వర్షపు నీటి కోసం ఇంకుడు గుంతలు ఉండేలా సవరణ చేసుకోవాలి. ఆక్యుపెన్సీ-కమ్-కంప్లీషన్ సర్ట్ఫికేట్ (ఒసీసీ) ఇచ్చే ముందు పరిశీలన చేయాలని సూచించింది. వర్షపు నీటి సంరక్షణ కోసం కమిటీలను పునరుద్ధరించనున్నట్లు తెలిపింది.

నీటి సంక్షరణకు మార్గమిది..

* వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చూడాలి. ఇంటి పైకప్పు నుంచి, ఇంటి ఆవరణలో, ఇంటి బయట పారే నీటిని భూగర్భంలోకి ఇంకేలా ఇంకుడు గుంత లేదా కందకాలు తీయించాలి. ఇంకుడు గుంత ఉంటేనే ఇంటి నిర్మాణానికి అనుమతినివ్వాలి. సేద్యపు కుంట ఉంటేనే వ్యవసాయ రాయితీలు వర్తింపజేయాలి

* ఆరు బయట పడే వర్షపు నీటిని మురుగు కాలువల్లోకి మళ్లించకుండా లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లిస్తే ఎక్కడికక్కడ స్థానిక భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుంది.

* కేవలం 9 శాతం వర్షపు నీరు మాత్రమే భూగర్భంలోకి వెళ్తొంది. దీనిని 15 శాతానికి మార్చటానికి కృతిమ పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంది,

* చెరువులు, కుంటల్లో దగ్గరుండి పూడిక తీయించుకోవాలి

* వర్షపు నీటిని రైతు పొలంలోనే ఇంకించి భూగర్భ జలం వృద్ధి చేసుకోవడం చాలా సులభం. చాలా తక్కువ ఖర్చుతో కూడిన పని ఇది. ఎకరా ఒక్కింటికి రూ.వెయ్యికి మించి ఖర్చు చేయకుండా భూగర్భ జల మట్టం పెంచుకునే వీలుంది.

ఇటు పట్టణాల్లో కూడా ఇంకుడు గుంతలు చాలా అవసరం.. వర్షాకాలం నీటిని వృధా పోనీకుండా నిల్వ చేసుకోవడం.. వాటిని ఫిల్టర్ చేసివాడటం వంటి పద్దతులను పాటిస్తే.. భూగర్భజలాలను సరైన పద్దతిలో వాడుకుంటున్నట్టే అవుతుంది. ఇక పల్లెల్లో కుంతల్లోనూ చెరువుల్లోనూ వర్షపు నీటిని ఒడిసిపట్టడం చూసైనా మనం ఇవే పద్దతులను పాటించడం ఎంతైనా అవసరం.

%d bloggers like this: