September 29, 2023
Rukhmabai

బాల్య వివాహాన్ని రద్దుపరుచుకున్న.. రూఖ్మాభాయ్

ఈ కేసు తరువాత వివాహానికి తగిన వయసు చట్టం 1891ను ఆమోదించడంలో రఖ్మాబాయి కేసు అప్పటి సమాజంలో కీలకంగా మారింది. ఆడపిల్ల వివాహ వయసు 10 నుంచీ 12 కి పెంచింది అప్పటి ప్రభుత్వం. ఇది ఆడపిల్లల పాలిట వరమే అప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే శృంగారం అంటే తెలియని వయసులో ఆడపిల్లను పెళ్ళిపేరుతో హింసను కాస్తన్నా ఆపగలిగింది ఈ చట్టం. 10 ఏళ్ళ బాలికలపై లైంగిక చర్యకు పాల్పడితే శిక్షలు విధించే మార్పును ఈ చట్టం తీసుకువచ్చింది.

ఒక గెలుపు మరో గెలుపుకు నాంది అవుతుంది.. అలాగే ఒక ఓటమి మరో గెలుపుకు నాంది కావచ్చు. ఆమె జీవితం ఎందరో బాలికల కన్నీళ్ళు తుడిచింది. ఎందరిలోనో స్పూర్తిని నింపింది. ఆమె రూఖ్మాభాయ్.. ముక్కుపచ్చలారని పసిదానికి మూడు ముళ్ళ బంధాన్ని బిగించే సంప్రదాయం పుట్టిన నాటికి వెళితే.. అప్పటికి మహిళకు ఒట్టిపోయిన ఆవుకున్న గుర్తింపుకూడా లేకుండా పోయేది. ఆడ బిడ్డ పుట్టటమే నేరంగా చూసే రోజులు అవి.. ఇప్పటికీ అదే వాతావరణం కొనసాగుతున్నా.. అప్పటి రోజుల్లో ఆడబిడ్డకు అన్నీ పరిమితులే.. గట్టిగా నవ్వినా, మాట్లాడినా, పరుగెత్తినా.. ఏం చేసినా తప్పులెంచేది సమాజం. వీటిమధ్య బిక్కుబిక్కుమని పెరిగే బాల్యం. ముక్కుపచ్చలారకుండానే.. రెండింతలు వయసున్న వ్యక్తికి భార్యగా వెళ్ళడం, చిన్నవయసులోనే సెక్స్, గర్భం దాల్చడం, చాలా గర్భాలు పోవడం.. ఇవన్నీ ఆమెను శారీరకంగా కుంగదీసేవి. ఇక మానసికంగా ఆమెకు పెద్ద కుటుంబంలో బాధ్యతలు, కట్టుబాట్లు, సరైన అవగాహన లేని జీవితం. తీరా ఆమెకు యుక్తవయసు వచ్చేనాటికి కట్టుకున్నవాడు కాలం చేయడం.. గుండు గీసి విధవను చేసి చీకటి గదిలోకి నెట్టడం… అంటరాని తనం కన్నా దారుణమైన జీవనం. ఇదీ ఆమె పరిస్థితి.. అప్పటి దయనీయ వాతావరణం.

ఇంతటి దయనీయ స్థితిని ఆ ముక్కుపచ్చలారని పసిది అడ్డుకుంది.. తనకి చేసిన పెళ్ళి ఇష్టం లేదంది. బలవంతంగా కాపురానికి వెళ్ళనంది. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడింది.

నవంబర్ 22, 1864 న జనార్ధన్ పాండురంగ్, జయంతిబాయి దంపతులకు జన్మించింది రూఖ్మాబాయ్. ఈమె తండ్రి తన రెండు సంవత్సరాల వయస్సులో, తల్లి తన పదిహేడేళ్ళ వయసులో కన్నుమూశారు. పదకొండేళ్ళ ప్రాయంలోనే బాల్య వివాహం జరిగింది రుఖ్మాబాయ్ కి. కానీ కాపురానికి వెళ్ళెందుకు ఆమెకు ఇష్టం లేకపోయింది. కాపురానికి రావాలని భర్త కోర్టుకెక్కాడు. నాకు ఇష్టంలేని పెళ్ళిచేసారనీ.. వెళ్ళే ప్రసక్తేలేదని రుఖ్మాబాయ్ తానూ కోర్టును ఆశ్రయించింది. అప్పటి సమాజంలో స్త్రీ కోర్టుకు వెళ్లడం అనేది పెద్ద నేరంగా.. ఘోరంగా చూసేవారు. చదువుకుని జ్ఞానం ఉన్నవారికే ఆమె పోరాటం పెద్ద నేరంగా కనిపించింది. అప్పటి స్వాతంత్ర్య ఉద్యమకారుడు అయిన బాలగంగాధర్ తిలక్ రూఖ్మాభాయి పనిని తప్పుబడ్డాడు. ఆమె నేరస్తులతో సమానమని వాఖ్యానించాడు. అన్ని విమర్శలను ఆమె ధైర్యంగా ఎదుర్కుంది. సవతి తండ్రి సఖారామ్ అర్జున్ సాయంతో ఆమె విడాకుల కోసం మళ్లీ పోరాడింది. ఈసారి భర్తకు అనుకూలంగా తీర్పువచ్చింది. కాపురానికి వెళ్ళడమా.. లేక ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించడమో తేల్చుకోమంది. అయినా చలించలేదు.. రూఖ్మాభాయి.. క్వీన్ విక్టోరియాకు తనకు విడాకులు ఇప్పించమని జాబు రాసింది. క్వీన్ ఉత్తర్వులతో కోర్టు తీర్పు రద్దయింది. వివాహాన్ని కూడా రద్దుచేసుకున్నాడు ఆమె భర్త.

ఈ కేసు తరువాత వివాహానికి తగిన వయసు చట్టం 1891ను ఆమోదించడంలో రఖ్మాబాయి కేసు అప్పటి సమాజంలో కీలకంగా మారింది. ఆడపిల్ల వివాహ వయసు 10 నుంచీ 12 కి పెంచింది అప్పటి ప్రభుత్వం. ఇది ఆడపిల్లల పాలిట వరమే అప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే శృంగారం అంటే తెలియని వయసులో ఆడపిల్లను పెళ్ళిపేరుతో హింసను కాస్తన్నా ఆపగలిగింది ఈ చట్టం. 10 ఏళ్ళ బాలికలపై లైంగిక చర్యకు పాల్పడితే శిక్షలు విధించే మార్పును ఈ చట్టం తీసుకువచ్చింది.

కోర్టు తీర్పుతో కాస్త ఊరడించిన రూఖ్మాభాయిలో చదుకోవాలనే ఆకాంక్ష మరింత పెరిగింది. వైద్య వృత్తినే చేపట్టాలనుకుంది రూఖ్మాభాయి. అందుకు కొందరు సాయానికి ముందుకు వచ్చారు. చదువుకు డాక్టర్ ఎడిత్ పెచే వంటి వారి నుండి ఆర్థిక సహాయం లభించింది, ఆమె తదుపరి విద్య కోసం శివాజీరావ్ హోల్కర్, ఇవా మెక్లారెన్, వాల్టర్ మెక్లారెన్ వంటి వాళ్ళు 500 రూపాయలను తన చదువు కోసం విరాళంగా ఇచ్చారు. ఇలా కొంత మంది సామాజిక కార్యకర్తల సహకారంతో ఈమె 1889 లో ఇంగ్లాండ్‌ లో మెడిసిన్ అధ్యయనం కోసం బయలుదేరింది. 1894 లో, రాయల్ ఫ్రీ హాస్పిటల్‌లో చదువుకున్న ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ ఉమెన్ నుండి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ పట్టాను అందుకుంది. వైద్యులు కదంబిని గంగూలీ, ఆనంది గోపాల్ జోషి 1886 లో వైద్య డిగ్రీలు పొందిన మొట్టమొదటి భారతీయ మహిళలు.

తన చదువు పూర్తి అయిన అనంతరం 1895 లో ఈమె భారతదేశానికి తిరిగి వచ్చి సూరత్‌లోని మహిళా ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. 1929 లో పదవీ విరమణ చేసే వరకు రాజ్‌కోట్‌లోని జెనానా ఉమెన్స్ స్టేట్ హాస్పిటల్‌లో పనిచేశారు. రూఖ్మాభాయి తన పదవీ విరమణ తర్వాత ముంబై లో స్థిరపడింది.

1929 లో తన పదవి విరమణ చేసిన అనంతరం “పర్దా – దాని రద్దు చేయవలసిన అవసరం” అనే పేరుతో ఒక కరపత్రాన్ని ప్రచురించింది రూఖ్మాభాయి. ఈ కరపత్రం యువ వితంతువులు సమాజంలో ఎలా నడుచుకోవాలనే దానిపై వివరించారు. 2008 లో రుఖ్మాభాయి, ఆమె భర్త మధ్య జరిగిన న్యాయ కేసు యొక్క ప్రత్యేకతలులను రచయిత సుధీర్ చంద్ర రాసిన “ఎన్స్లేవ్డ్ డాటర్స్: కలోనియలిజం, లా అండ్ ఉమెన్స్ రైట్స్” అనే పేరుతో పుస్తకం ప్రచురించబడింది.

ఈమె జీవిత కథను 2016లో డాక్టర్ రాఖ్మాబాయి అనే పేరుతో అనంత్ మహాదేవన్ దర్శకత్వంలో తన్నిష్తా ఛటర్జీ ప్రధాన పాత్రలో సినిమాగా చిత్రీకరించారు. ఈ సినిమాను డాక్టర్ స్వాప్నా పాట్కర్ నిర్మించారు. సూరత్‌లోని ఒక ఆసుపత్రికి రూఖ్మాభాయి పేరు పెట్టారు. నవంబర్ 22, 2017 న రూఖ్మా 153 వ పుట్టినరోజును పురస్కరించుకొని గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ లో గూగుల్ డూడుల్‌తో మొదటి పేజీలో పెట్టి గౌరవించింది.

%d bloggers like this: